మెడికో ప్రియాంక మృతిపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.. ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించాం
ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది: హోం మంత్రి అనిత
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9:
రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కలచివేసిందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషాద ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి అనిత తెలిపారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. యువత బాధ్యతారహితంగా వ్యవహరించడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఆమె అన్నారు.
ప్రియాంక కుటుంబ సభ్యులకు హోం మంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై చట్టపరమైన చర్యలు కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

