Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నండీఎస్సీ అక్రమాలపై వినూత్న నిరసన.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ...

డీఎస్సీ అక్రమాలపై వినూత్న నిరసన.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్

ఏపీ జెన్ జీ నిరసనతో దద్దరిల్లిన దక్షిణం

డీఎస్సీ అక్రమాలపై వినూత్న నిరసన.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్

మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్

గాంధీ పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన వైసీపీ శ్రేణులు

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగష్టు 8: డీఎస్సీ అక్రమాలపై నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఏపీ జెన్ జీ ఆందోళన కార్యక్రమం శనివారం హోరెత్తింది. జీవీఎంసీ గాంధీ పార్క్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల చివరి రోజు విద్యార్థులు, యువత, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్సీ అంశంపై యువత స్వచ్ఛందంగా పోరాటంలో భాగస్వాములు అవుతున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన జెన్ జీ నిరసన తరహాలో యువతలో చైతన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

చివరి రోజు దీక్షల్లో ఉత్తరాంధ్ర స్టూడెంట్ విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ పాల్గొని డీఎస్సీ అంశంపై ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ జానకిరామ్‌తో పాటు పలువురు వార్డు అధ్యక్షులు దీక్ష చేపట్టారు.

సాంస్కృతిక ప్రదర్శనలతో వినూత్న నిరసన

డీఎస్సీ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తప్పెటగుళ్లు, తెలంగాణ సంప్రదాయ బోనాలు, మత్స్యకార పాటలు, సంప్రదాయ వేషధారణలు, భరతనాట్యం, నాటకాలతో నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. మత్స్యకారుడి వేషధారణలో వాసుపల్లి బాబురావు ఆకట్టుకున్నారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ కుమార్తె ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థుల విద్య, వైద్యానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను నిరాశకు గురిచేస్తోందని వాసుపల్లి ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటికొక ఉద్యోగం వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలన్న ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించాలని కోరారు. యువత ఆగ్రహానికి గురికాకముందే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీఎస్సీ అభ్యర్థులు, యువతకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తుందని వాసుపల్లి స్పష్టం చేశారు.

10న భారీ బైక్ ర్యాలీ

డీఎస్సీ అంశంపై నిరసనలో భాగంగా సోమవారం 10వ తేదీ ఉదయం 10 గంటలకు జగదాంబ జంక్షన్ నుంచి యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కనకల ఈశ్వరరావు, దక్షిణ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సకలభక్తుల ప్రసాద్ రావుతో పాటు రాష్ట్ర, జిల్లా, వార్డు స్థాయి స్టూడెంట్, యూత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular