Homeఆంధ్రప్రదేశ్అమరావతికేసుల సుడిగుండంలో వైఎస్సార్‌సీపీ నేతలు..!

కేసుల సుడిగుండంలో వైఎస్సార్‌సీపీ నేతలు..!

రాజకీయ కక్షా..? లేక చట్టపరమైన సంక్షోభమా..?
అరెస్టులు.. ముందస్తు బెయిళ్లు.. ఆజ్ఞాతం.. ప్రతిపక్షానికి పెరుగుతున్న పరీక్ష

 పెన్ పవర్ ప్రత్యేక కథనం, విజయవాడ, ఆగస్టు 5:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చ అంతా ఒకే అంశం చుట్టూ తిరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, కీలక నాయకులు వరుసగా వివిధ క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. కొందరు అరెస్టు అవుతుండగా, మరికొందరు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపులు తడుతున్నారు. ఇంకొందరు పోలీసుల చర్యల నేపథ్యంలో ఆజ్ఞాతంలోకి వెళ్లడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

రాజకీయ అధికారం మారిన తర్వాత ఈ పరిణామాలు వేగం పుంజుకోవడంతో ఇవి నిజంగా చట్టపరమైన చర్యలా? లేక రాజకీయ కక్షసాధింపా? అనే చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా మొదలైంది.

ఇటీవలి కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై భూ వ్యవహారాలు, డెత్ సర్టిఫికెట్ ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదు కావడం, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అపహరణ కేసులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం, మహిళా ఎస్‌ఐపై విధుల్లో ఉండగా దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆముదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టడం, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు కావడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, కైలే అనిల్ కుమార్, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు కూడా వివిధ కేసుల నేపథ్యంలో న్యాయస్థానాలను ఆశ్రయించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పరిణామాలన్నింటినీ వైఎస్సార్‌సీపీ మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పదేపదే ఒకే వాదన వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు అధికార వర్గాలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. నమోదవుతున్న కేసులు రాజకీయ ప్రసంగాలు, నిరసనలు లేదా పార్టీ కార్యకలాపాలకు సంబంధించినవి కావని, భూ పత్రాల ఫోర్జరీ, భూ వివాదాలు, అపహరణ ఆరోపణలు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై దాడులు వంటి తీవ్రమైన ఆరోపణల ఆధారంగానే కేసులు నమోదు అవుతున్నాయని చెబుతున్నాయి. చట్టం ముందు ఎవరైనా సమానమేనన్న వాదనను ప్రభుత్వం ముందుకు తెస్తోంది.

ఇక్కడే రాజకీయ విశ్లేషణకు ఆస్కారం ఏర్పడుతోంది. గత ఐదేళ్ల అధికార కాలంలో జిల్లాలు, నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కొందరు నాయకులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే ధోరణిని కొనసాగించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక అధికారులతో ఘర్షణలు, భూ వ్యవహారాల్లో వివాదాలు, చట్టపరమైన పరిమితులను లెక్కచేయకపోవడం వంటి అంశాలు ఇప్పుడు వారిని న్యాయపరమైన ఇబ్బందుల్లోకి నెట్టాయనే విశ్లేషణ వినిపిస్తోంది.

అదే సమయంలో ప్రతిపక్షాన్ని రాజకీయంగా బలహీనపర్చేందుకు అధికార పార్టీ కూడా దర్యాప్తు సంస్థలను మరింత దూకుడుగా వినియోగిస్తోందనే విమర్శలను పూర్తిగా తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందువల్ల ఈ రెండు వాదనల మధ్య నిజానిజాలను తేల్చేది చివరికి న్యాయస్థానాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రతిపక్షంగా ఉన్నందున ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ సానుభూతి పొందాలనే వ్యూహాన్ని వైఎస్సార్‌సీపీ అనుసరిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆరోపణలు వ్యక్తిగత క్రిమినల్ స్వభావానికి చెందినవిగా కనిపించినప్పుడు “రాజకీయ బాధితులు” అనే వాదన ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్నగా మిగులుతోంది.

ఈ వరుస కేసుల ప్రభావం పార్టీ కేడర్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించే ప్రధాన నాయకులే కోర్టు వ్యవహారాల్లో నిమగ్నమవడం, కొందరు అరెస్టులు ఎదుర్కోవడం, మరికొందరు ఆజ్ఞాతంలో ఉండటం వల్ల స్థానిక శ్రేణుల్లో నాయకత్వ లోటు కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా చట్టపరమైన భయం పెరగడంతో పార్టీ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ముందున్న ప్రధాన సవాలు కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు; చట్టపరమైన పోరాటం కూడా. నమోదవుతున్న ప్రతి కేసును రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించడం ఒక వ్యూహమైతే, ఆ ఆరోపణలను న్యాయపరంగా సమర్థంగా ఎదుర్కోవడం మరో కీలక బాధ్యతగా మారింది. రాబోయే రోజుల్లో కోర్టుల తీర్పులు, దర్యాప్తు సంస్థల చర్యలు, ప్రజల అభిప్రాయం… ఈ మూడు అంశాలే వైఎస్సార్‌సీపీ రాజకీయ భవిష్యత్తుపై ఎంత మేర ప్రభావం చూపనున్నాయో నిర్ణయించే అవకాశం ఉంది.

— పెన్ పవర్ పొలిటికల్ బ్యూరో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular