శాంతియుత వాతావరణంలో ఆరాధనలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని విశ్వాసుల విజ్ఞప్తి
చీరాల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : మండలంలోని సాల్మన్ సెంటర్ బేర్ కాంపౌండ్‌లోని చర్చి నిర్వహణకు సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో కొందరు విశ్వాసులు ప్రత్యేకంగా ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధనలు కొనసాగిస్తున్నారు. సమస్యను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు జైసన్ మాట్లాడుతూ.. చర్చి నిర్వహణకు సంబంధించి కొన్ని అనివార్య కారణాలతో విభేదాలు తలెత్తాయని తెలిపారు. ఆదివారం ఆరాధన సమయంలో విశ్వాసులు సమర్పించే కానుకల సొమ్ము విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని తాము ప్రశ్నించామని, దీంతో కొందరు తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమపై దుష్ప్రచారం, దుర్భాషలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో చర్చిలో ప్రశాంతంగా ఆరాధనలు కొనసాగించడం ఇబ్బందికరంగా భావించి ఏఎల్సీ ప్రతినిధులను సంప్రదించినట్లు జైసన్ తెలిపారు. వారి సూచనల మేరకు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఏఎల్సీ ప్రతినిధుల ద్వారా పాస్టర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహిస్తూ సంఘాన్ని కొనసాగిస్తున్నామని వివరించారు. తమకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని, చిన్నారులతో పాటు విశ్వాసులందరూ ప్రశాంత వాతావరణంలో కలిసి ప్రార్థనలు చేసుకోవడమే తమ లక్ష్యమని జైసన్ స్పష్టం చేశారు. బేర్ కాంపౌండ్‌లోని చర్చిలో నెలకొన్న సమస్యల కారణంగానే ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న ప్రార్థనలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా కేవలం ప్రార్థనలు, ఆరాధనలు మాత్రమే నిర్వహిస్తున్నామని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

