బాపట్ల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ప్రభావంతో బాపట్ల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన ఇళ్లు, మిద్దెల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాలు, వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ 08643-220226 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారుల నుంచి వెలువడే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ కోరారు.

