Homeఆంధ్రప్రదేశ్పోలవరం18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

పీవీటీజీ, గుత్తికోయ, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల ఓటర్లపై ప్రత్యేక దృష్టి
చనిపోయిన వారి పేర్ల తొలగింపునకు గ్రామసభల ద్వారా పరిశీలన

రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబరు 30: పోలవరం జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడిని ఓటరుగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్‌కో డైరెక్టర్, ఎలక్టోరల్ పరిశీలకులు ఎస్. నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం ఓటరు జాబితాలో పేరు పొందుపరచాలని సూచించారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (SIR)పై బుధవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు ఎస్. నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొక్వాల్, ఓఎస్డీ జావలి, రంపచోడవరం ఆర్డీఓ కె. స్వాతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ పీవీటీజీ కుటుంబాల ఓటరు నమోదు అంశాన్ని ప్రత్యేకంగా పునఃపరిశీలించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లోనూ బీఎల్‌ఓలు, ఏఈఆర్‌ఓలు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి 1950 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక గ్రీవెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలపై ప్రత్యేక దృష్టి

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నుంచి తరలించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లోని ఓటర్ల సమస్యలను పరిష్కరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలకుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గుత్తికోయ ఓటర్ల నమోదును ఒకటికి రెండుసార్లు పరిశీలించి, అవసరమైన చోట గ్రామసభలు నిర్వహించి తీర్మానాల ఆధారంగా అర్హులకు ఓటు హక్కు కల్పించాలని నాగలక్ష్మి సూచించారు.

జిల్లాలోని 12 మండలాల పరిధిలో 399 పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి అక్కడికక్కడే దరఖాస్తులు స్వీకరించి, పరిశీలన అనంతరం ఓటరు జాబితాలో చేర్చాలని ఆదేశించారు.

మృతుల పేర్లపై క్షేత్రస్థాయి పరిశీలన

ఈ నియోజకవర్గంలో మృతుల పేర్లు ఓటరు జాబితాల్లో కొనసాగుతున్న అంశంపై కూడా నాగలక్ష్మి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మృతుల వివరాలను ఒకటికి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చోట పంచనామాలు నిర్వహించాలని సూచించారు. గ్రామసభల ద్వారా నిర్ధారించిన అనంతరం మృతుల పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాజకీయ పార్టీలతో సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటరు జాబితాకు సంబంధించిన మార్పులు, చేర్పులను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పి. శ్రీనివాసరావు, స్వప్న కుమారి, బుద్ధ వెంకన్నబాబు, కిరణ్, కె. బాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్లు సునీత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular