బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రంలో చట్ట సవరణ చేయించి రిజర్వేషన్లు అమలు చేయండి
రిజర్వేషన్లపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఘాటు వ్యాఖ్యలు
నర్సీపట్నం , పెన్ పవర్ :
రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లపై ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని పెట్ల ఉమాశంకర గణేష్ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు వెళ్ళినా చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు బీసీల కోసం ఏదో త్యాగం చేస్తున్నట్లుగా గత రెండు నెలలుగా రాష్ట్రంలో డ్రామాలు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై 2024 ఆగస్టు 28న చంద్రబాబు జీవో 105 ఇచ్చారని, 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఆ జీవోపై టీడీపీ నాయకులు నానా హంగామా చేశారని చెప్పారు. ఇదే జీవోను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 అక్టోబర్ 28న జీవో 176 ద్వారా ఏడు సంవత్సరాల క్రితమే ఇచ్చారని, దానిపై టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్తే కోర్టు ఆ జీవోను రద్దు చేసిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% కన్నా ఎక్కువ అవకాశాలు కల్పించేలా సంకల్పం తీసుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం బీసీలను మోసం చేసేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీసీలకు 50 సంవత్సరాలకే రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, బీసీ రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్, ప్రత్యేక బ్యాంక్, నిరుద్యోగ భృతి వంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీసీలు మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే చట్ట సవరణ చేసి 34% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి బీసీ కూడా వీరికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

