ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో వైసిపి నిరసన
భారీగా తరలివచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలు
నర్సీపట్నం, పెన్ పవర్ :
అమలు కానీ ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, నేటికీ 28 నెలలు గడుస్తున్న హామీలు అమలు చేయకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నంలో పోరుబాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడుతో కలిసి ఆర్డిఓ కార్యాలయ పరిపాలన అధికారికి ఉమాశంకర్ గణేష్ వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ కొద్దిసేపు వైసిపి శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ బూటకపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని విమర్శించారు. నేటికీ 28 నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలో అంశాలు అమలు చేయకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నర్సీపట్నం నియోజకవర్గం వరకు సూపర్ సిక్స్ పథకాల అమలులో లోపాలను గణాంకాలతో వివరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే త్వరలోనే పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ గఫూర్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

