స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 ప్రదానం
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 ప్రధానోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి గొర్లె భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. చెత్తను పడేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల్లో ప్రతి నెల శ్రమదానం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో జిల్లా ఆరు నెలల క్రితం 26వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 14వ స్థానానికి చేరిందన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతను జీవిత విధానంగా మార్చుకోవాలని కోరారు. రంపచోడవరం ఎమ్మెల్యే, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
స్వచ్ఛత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతలో ప్రతిభ కనబరిచిన 47 మంది అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, చింతూరు సబ్ కలెక్టర్ సీహెచ్. నరేంద్ర పడాల్, ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

