చెరువులో నిర్మాణ వ్యర్థాల డంపింగ్
పర్యావరణానికి పెను ముప్పు
చెరువుల పరిరక్షణ గాలికొదిలేశారా?
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత గద్ద క్రాంతి డిమాండ్
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 12
ఉప్పల్ నియోజకవర్గం నాచారం 21వ డివిజన్ పరిధిలోని ఎర్రకుంట–పటేల్‌కుంట చెరువు పరిసరాల్లో నిర్మాణ వ్యర్థాల డంపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన వ్యర్థాలను చెరువు పరిసరాల్లో పారవేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలతో పర్యావరణానికి, జలవనరులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకుడు గద్ద క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎర్రకుంట ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా వెలువడిన వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా చెరువు పరిసరాల్లో డంపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆక్రమణలు, పూడిక సమస్యలతో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో నిర్మాణ వ్యర్థాలను సైతం చెరువు పరిసరాల్లో వేయడం పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై డివిజన్ ఏఈ, వర్క్స్ ఇన్స్పెక్టర్, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్, జీహెచ్ఎంసీ అధికారుల బాధ్యతను నిర్ధారించాలని గద్ద క్రాంతి డిమాండ్ చేశారు. నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు పరిసరాల్లో ఇప్పటికే పడవేసిన వ్యర్థాలను తక్షణమే తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.

