బీ-ఫారాల కోసం ఉత్కంఠ.. టికెట్ల ఖరారుపై వీడని పీటముడి!
కాజులూరు, అక్టోబర్ 24 పెన్ పవర్: కాజులూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన మొత్తం 97 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్. విజయరాజు, ఎంపీడీవో జె. రాంబాబు తెలిపారు.
పార్టీల వారీగా జనసేన నుంచి 22, తెలుగుదేశం పార్టీ నుంచి 22, వైఎస్సార్సీపీ నుంచి 43, స్వతంత్రులుగా ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం మొత్తం 97 నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు.
కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ
నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల దృష్టి బీ-ఫారాలపై పడింది. పార్టీ అధికారిక అభ్యర్థులుగా ఎవరి పేర్లు ఖరారవుతాయన్న అంశం మండల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల ఖరారుపై వీడని పీటముడి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కొందరు నేతల మద్దతుతో నామినేషన్లు వేయగా, మరికొందరు పార్టీ ముఖ్య నాయకుల అండతో బరిలో నిలిచారు. దీంతో ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.
రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాలు
కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరగడంతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి సవాలుగా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా టికెట్ దక్కని అభ్యర్థులు పోటీలో కొనసాగకుండా బుజ్జగించేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆదివారం మధ్యాహ్నంలోగా రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా నేతలు ప్రయత్నించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగియనుండటంతో అప్పటిలోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా కాజులూరు మండలంలో నామినేషన్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసినా, బీ-ఫారాల కేటాయింపు, కూటమి సీట్ల సర్దుబాటు, రెబల్ అభ్యర్థుల ఉపసంహరణ అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

