ప్రజాప్రతినిధులకు మంత్రి సుభాష్ పిలుపు
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 19: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నూతనంగా ఎన్నికైన మండల ప్రజాపరిషత్ పాలకవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే కేవలం హోదా కాదని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
కాజులూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఆర్యవటానికి చెందిన చందాల ఆదినారాయణ (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా కుయ్యేరుకు చెందిన పోలిశెట్టి సీతామహాలక్ష్మి (జనసేన) ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రత్యేకాధికారి ఆర్. విజయరాజు సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన అభినందన కార్యక్రమానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఉప ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పదవులను ప్రజాసేవకు అవకాశంగా భావించి సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు.
అంతకుముందు మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కె.గంగవరం ఎంపీపీగా చుండ్రు సూర్యకుమారి, వైస్ ఎంపీపీగా కొప్పిశెట్టి సతీష్ కుమార్ ఎన్నికై ఎన్నికల ప్రత్యేకాధికారి బి.ఎస్. రామ్ గోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
అదేవిధంగా రామచంద్రపురం రూరల్ మండల ఎంపీపీగా డాక్టర్ మడకా రాంబాబు, వైస్ ఎంపీపీగా కొండేటి జానకిరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి బి. నాగకుమార్, ఎంపీడీవో పద్మజ్యోతి సమక్షంలో ఎంపీటీసీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీలు రవ్వా సీతామహాలక్ష్మి, టేకుమూడి సుజాత, కూటి శేషారత్నం, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ మేడిశెట్టి శేషారావు, యండగండి చౌదరి, డాక్టర్ బాబు, చుండ్రు వీర్రాజు చౌదరి, చిక్కాల దొరబాబు, డేగల సతీష్, కూటి రంజిత్‌కుమార్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

