తొలి రోజే బరిలోకి కూటమి అభ్యర్థులు
కాజులూరు, నవంబర్ 18 (పెన్ పవర్): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాజులూరు మండల పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలి రోజే పలువురు అభ్యర్థులు తమ అనుచరులు, వార్డు సభ్యులతో కలిసి ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. పోటీ చేయనున్న అభ్యర్థులు తమకు అనుకూలమైన ముహూర్తాలను చూసుకుని నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు.
మండలంలోని శలపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో కూటమి మద్దతుతో మాజీ సర్పంచ్ పోతుల గనిరాజు భార్య పోతుల శ్రీలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. బుధవారం తొలి రోజు గొల్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి ఆమె గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట వచ్చిన పలువురు వార్డు సభ్యులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో సలపాక గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత సందడిగా మారింది.అదేవిధంగా మండల కేంద్రమైన కాజులూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెల్ కేంద్రంలో కూటమి మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి వట్టూరి పట్టాభి రామయ్య బుధవారం మధ్యాహ్నం తన వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
నామినేషన్ల స్వీకరణకు తొలి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు, మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. రానున్న రోజుల్లో మరింత మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో కాజులూరు మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ ఎలా ఉండబోతోందన్న చర్చ స్థానికంగా జోరందుకుంది.శ్రీలక్ష్మి వెంట మండా గోవిందా రెడ్డి, రామిరెడ్డి చక్రరావు,మాధవరపు దొరబాబు,డేగల దొరబాబు, చినబాబు, పోతురాజు భీమారావు తదితరులు ఉన్నారు.

