ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లికొలువుదీరిన అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం

కొలువుదీరిన అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్:

​అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా కర్రి భాస్కరరావు, కార్యదర్శిగా చెన్నా మూర్తి, కోశాధికారిగా పెదపాటి రాజా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి.వి.ఎస్ ప్రసాద్, పోసిన వీరేంద్ర, రాష్ట్ర కార్యదర్శి మద్దాల శేఖర్, రాష్ట్ర కోశాధికారి నాయుడు రాజన్‌లతో పాటు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైనదని, మనిషి పుట్టుక నుంచి తుదిశ్వాస వరకు ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని తమ కెమెరాల్లో బంధిస్తారని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ప్రపంచంలో ఎక్కడ ఏ జరిగినా క్షణాల్లో ఇక్కడ చూసే స్థాయికి సాంకేతికత అందుబాటులో ఉందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 వేల నుంచి లక్ష మంది వరకు ప్రత్యక్షంగా ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరంతా కలిసికట్టుగా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన శిక్షణ పొందవలసిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం మరియు నైపుణ్యాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్పీకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఫోటోగ్రాఫర్ల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేలా తాను బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే విగ్రహాన్ని విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు ఇప్పించే బాధ్యతను కూడా తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగంలో ఉన్న వారందరూ ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టుకుని, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు పెళ్లినాటి ఫోటోలను డిజిటల్ రూపంలో పొందుపరిచిన ఆల్బమ్ ను ఆయన ఆవిష్కరించారు. ఆనాటి ఫోటోలను చూసుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ స్పీకర్ మురిసిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular