వెంకటేశ్వరరావు జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం
ఘనంగా పదవి విరమణ కార్యక్రమం
చింతపల్లి,పెన్ పవర్,జూలై1: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి చెందిన కుడుముల వెంకటేశ్వరరావు సాధారణ కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి, తన కృషి, పట్టుదలతో పోలీసు శాఖలో విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన జీవిత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.1966 జనవరి 1న జన్మించిన వెంకటేశ్వరరావు ప్రాథమిక విద్యను లమ్మసింగిలో పూర్తి చేసి, అనంతరం ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని జీవితంలో ఒక్కో మెట్టు ఎదిగారు.1985లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అనంతరం సిఐఎస్ఎఫ్ లో చేరి దేశంలోని పలు కీలక ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, రక్షణ ప్రాధాన్య సంస్థల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సహచరుల ప్రశంసలు అందుకున్నారు.విద్యకు ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చిన వెంకటేశ్వరరావు ఉద్యోగంలో కొనసాగుతూనే బీఏ, బీఎడ్, ఎంఏ (ఇంగ్లీష్) వంటి ఉన్నత విద్యలను పూర్తి చేశారు. నిరంతర అధ్యయనం, స్వీయాభివృద్ధి పట్ల ఆయన చూపిన ఆసక్తి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ విద్య, క్రమశిక్షణ, దేశభక్తి విలువలను యువతలో పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తన జీవితంతో నిరూపించారు. ఆయన పదవి విరమణ సందర్భంగా మండల ప్రజలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కుడుముల వెంకటేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, పదవి విరమణ చేసినప్పటికీ ఆయన సేవలు ప్రజల్లో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఆయన జీవితం ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

