Homeఆంధ్రప్రదేశ్మండల సర్వసభ్య సమావేశంలో బ్యాక్సైట్, 1/70 చట్టాలపై తీర్మానం 

మండల సర్వసభ్య సమావేశంలో బ్యాక్సైట్, 1/70 చట్టాలపై తీర్మానం 

గిరిజన హక్కుల పరిరక్షణకు అధికారిక తీర్మానం చేయాలని డిమాండ్

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 2: అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల సర్వసభ్య సమావేశం బుధవారం బ్యాక్సైట్ తవ్వకాలు, 1/70 చట్టం అమలు అంశాలపై తీవ్ర చర్చకు వేదికైంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టాన్ని పునరుద్ధరించి పూర్తిస్థాయిలో అమలు చేయాలని, బ్యాక్సైట్ తవ్వకాలకు సంబంధించి నమూనాల సేకరణ ఏ అధికారుల అనుమతితో జరిగిందో స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.అడవుల్లో గుట్టుచప్పుడు కాకుండా బ్యాక్సైట్ నమూనాల సేకరణ జరగడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తూ, దీనిపై మండల, జిల్లా స్థాయి అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం, సమతా తీర్పు ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు లేదా ఖనిజ నమూనాల సేకరణ చేపట్టకూడదని సమావేశంలో స్పష్టం చేశారు.గిరిజనుల జీవనోపాధి, అడవులు, పర్యావరణానికి ముప్పు కలిగించే బ్యాక్సైట్ తవ్వకాల దిశగా జరుగుతున్న సర్వేలు, నమూనాల సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబుడిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీలో గిరిజనేతరుల భూ ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఖనిజ నమూనాల సేకరణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారిక తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తీర్మానం పత్రాన్ని ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు, వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనంద్, డిప్యూటీ తహసీల్దార్ సీతారాంకు ఎంపీటీసీలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అంపురంగి బుజ్జిబాబు,జోరంగి సరస్వతి, కృష్ణమూర్తి, కుమారి,ఎం సత్యనారాయణ,లోవ కుమారి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular