యువత గంజాయికి దూరంగా ఉండాలి: గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, జూలై 24: బాల్య వివాహాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ సూచించారు. మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో ఈగల్ బృందంతో కలిసి పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటిని పూర్తిగా అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే జీవితం దెబ్బతింటుందని హెచ్చరించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు పంపే అనుమానాస్పద లింకులను తెరవకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మహిళలపై జరిగే నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సీఐ సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమణారావు,పీటీఏ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు,ఈగల్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

