విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలి:
ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 1: జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థి నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పేలూరి సాయితేజ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులో భాగంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. జంతర్ మంతర్ నిరసనకు నాయకత్వం వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్‌తో పాటు ఇతర విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
విద్యా వ్యవస్థలోని సమస్యలను ప్రశ్నించే విద్యార్థులను అణచివేయడానికి కేసులు, అరెస్టులు, పోలీసు దాడులను ఉపయోగించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఒకవైపు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా, మరోవైపు విద్యార్థులపై కేసులు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, ఢిల్లీ పోలీసుల దాడిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన విద్యా విధానం (ఎన్ఈపీ–2020)ను రద్దు చేసి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కౌశిక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్‌తో పాటు మౌనిక, ప్రగతి, నరేష్, తులసి, తరుణ్, రమ్య, హృదయ, భగత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

