ముఠా కార్మికులకు ఈఎస్ఐ అమలుపై అవగాహన సదస్సు నిర్వహించిన సీఐటీయూ
– సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 6 : విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ముఠా కార్మికులకు ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ వల్లభ నాయుడు, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) & జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి సన్యాసి నాయుడు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే సంస్థలకు ఈఎస్ఐ వర్తిస్తుందని తెలిపారు. కార్మికుల నుంచి 0.75 శాతం, యాజమాన్యం నుంచి 3.25 శాతం చందా చెల్లించడం ద్వారా వైద్య సేవలు, జీతంతో కూడిన సెలవులు, ఈఎస్ఐ మెడికల్ కళాశాలల్లో పిల్లలకు రిజర్వేషన్, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. ఈ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్మికులకు అవగాహన కల్పించారు.
వల్లభ నాయుడు, సన్యాసి నాయుడు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెలకు రూ.21 వేల లోపు ఆదాయం ఉన్న అర్హులైన ఉద్యోగులు ఈఎస్ఐ సేవలను పొందవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, చదువుతున్న పిల్లలు, వివాహం అయ్యే వరకు కుమార్తెలు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని చెప్పారు. ముఠా కార్మికులు ఒకే యాజమాన్యం వద్ద కాకుండా వేర్వేరు చోట్ల పనిచేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను యాజమాన్యాలతో చర్చించి పరిష్కరించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ, ముఠా కార్మికులకు ప్రస్తుతం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలు, పని గంటలు, సెలవులు వంటి కార్మిక హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఠా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా వంటి సౌకర్యాలతో కూడిన సమగ్ర చట్టాన్ని తీసుకురావడంతో పాటు భవన నిర్మాణ కార్మికుల తరహాలో ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ అమలుకు ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ సీనియర్ గౌరవాధ్యక్షుడు వై. రాజు స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుబ్బారావు, బి. వెంకట్రావు, బి. జగన్, చంద్రమౌళి, ముఠా మేస్త్రీలు ఎన్. రమణ, సూరిబాబు, నాయుడు, అప్పారావు, శ్రీను తదితరులతో పాటు సిమెంట్, ఐరన్, ఫుడ్ గ్రెయిన్స్, మార్బుల్, గ్రానైట్, టైల్స్, ప్లైవుడ్, గ్లాస్, బేవరేజ్ కార్పొరేషన్, హోమ్ నీడ్స్ లోడింగ్ పనులు నిర్వహిస్తున్న ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

