ఖమ్మం, పెన్ పవర్ సెప్టెంబర్ 23:
నాగపూర్–అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఖమ్మం పరిధిలో బాధితులైన రైతులు, ఫ్లాట్ యజమానులకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం మరో కీలక దశకు చేరుకుంది. మంగళవారం ఢిల్లీ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు కేసులు ఫైల్ అయ్యాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన కేసులను కూడా ఫైల్ చేసేందుకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందనీ బాధిత రైతులు తెలిపారు. ఈ సందర్భంగా నాగపూర్ – అమరావతి హైవే నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోతున్న భూ యజమానులు మాట్లాడుతూ గత కొంతకాలంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వాదనలను వినిపించామనీ, న్యాయం కోసం హైకోర్టును కూడా ఆశ్రయించాము కానీ
ఆశించిన పరిష్కారం లభించకపోవడంతో, న్యాయం కోసం ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉండటం సహజమని, తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ, అన్యాయం జరిగిందని భావించినప్పుడు మౌనంగా కూర్చోకుండా న్యాయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి చట్టబద్ధమైన మార్గాన్ని ఉపయోగించుకుంటూ
చివరి న్యాయస్థానం వరకు వెళ్లి హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు.
ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించకుండా, ఎలాంటి అవాంఛనీయ చర్యలకు తావు లేకుండా, శాంతియుతంగా, ఐక్యంగా, చట్టబద్ధంగా మా హక్కుల కోసం పోరాడుతామని
అన్నారు. న్యాయ పోరాటం ద్వారా మాకు జరిగిన అన్యాయాన్ని సమాజం ముందుకు తీసుకెళ్లడం కూడా ఒక ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. తీర్పు ఏదైనా కావచ్చు కానీ హక్కుల కోసం చివరి వరకు చట్టబద్ధంగా పోరాడామనే తృప్తి మాకు ఉంటుంది అన్నారు.హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులు, ప్లాట్ల యజమానులు అందరూ ఐక్యంగా ఉండి ఈ న్యాయ పోరాటానికి సహకరించాలని కోరారు.

