✒️
బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలి
బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 8: బీచ్ షాక్స్ ఏర్పాటుకు సంబంధించిన జీవో 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారం, ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమల, జిల్లా కార్యదర్శి బేగం, ఐద్వా నాయకులు సత్యవతి, సీఎంఎస్ నాయకులు లలిత మాట్లాడుతూ.. సంపద సృష్టి పేరుతో బీచ్‌లో మద్యం విక్రయాలు, షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ బీచ్ విశ్రాంతి, వినోదం, ఆధ్యాత్మికత, ఆహ్లాదకరమైన కార్యక్రమాలకు వేదికగా ఉందని, బీచ్ షాక్స్ పేరుతో అక్కడ అనైతిక కార్యకలాపాలకు అవకాశం కల్పించే నిర్ణయాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మద్యం, గంజాయి, బెట్టింగ్ వంటి కార్యకలాపాలు పెరిగితే మహిళల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణహితమైన, సహజసిద్ధమైన విశాఖ బీచ్‌ను కాపాడుకునేందుకు ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. మహిళలకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీవో 362ను తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి, ఉపాధ్యక్షురాలు బాలనాగమ్మ, కార్యదర్శి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఫోటో క్యాప్షన్:
మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహిస్తున్న బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, కార్యకర్తలు.

