డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు
మద్యం మత్తులో రెండుసార్లు బైక్ను ఢీకొట్టిన నిందితులు
మాల్ సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఘోరం.. ప్రియాంక మృతి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
రాజమండ్రి, ఆగస్టు 11: డాక్టర్ ప్రియాంక మృతి కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ ఘటనకు కారణమైనట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు ఓ మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారి పరిస్థితిని గమనించిన మాల్ సిబ్బంది వారిని అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాల్ సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అనంతరం కారులో బయటకు వస్తుండగా సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా కారును నడిపిన నిందితులు తొలిసారి డాక్టర్ ప్రియాంక, ఆమె స్నేహితుడు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన అనంతరం ప్రియాంక, ఆమె స్నేహితుడు వెనక్కి తిరిగి చూసిన సమయంలో మాల్ సెక్యూరిటీ సిబ్బంది గేటును మూసివేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు సమాచారం.
మాల్ సిబ్బందికి పట్టుబడితే తమను పోలీసులకు అప్పగిస్తారనే భయంతో నిందితులు కారును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి ప్రియాంక బైక్ను ఢీకొట్టడంతో ఆమె, ఆమె స్నేహితుడు రోడ్డుపై పడిపోయారు. అయినప్పటికీ కారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
తీవ్ర గాయాలపాలైన ప్రియాంకను తొలుత రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంతో కేసు తీవ్రత పెరిగింది.
ఘటన అనంతరం పోలీసులు తొలుత ప్రమాదం, హత్యాయత్నం కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రియాంక మృతి అనంతరం కేసును హత్య కేసుగా మార్చి, నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో వాహనం నడపడం, మాల్ వద్ద జరిగిన పరిణామాలు, ప్రియాంక బైక్ను రెండుసార్లు ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

