Homeఆంధ్రప్రదేశ్పోలవరంఉపాధ్యాయుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు

ఉపాధ్యాయుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు

 

ఫారం-19తో తాజాగా నమోదు చేసుకోవాలి

డీఆర్వో కె.స్వాతి

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 28:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి ఉపాధ్యాయుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి అర్హత కలిగిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు నవంబర్ 6, 2026లోగా ఫారం-19 ద్వారా తాజాగా నమోదు చేసుకోవాలని పోలవరం జిల్లా ఓటరు నమోదు అధికారి, డీఆర్వో కె.స్వాతి తెలిపారు.

2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తామని, ఆ తేదీకి ముందు గడిచిన ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు ఉన్నత పాఠశాల లేదా అంతకంటే పై స్థాయి విద్యాసంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

గతంలో ఓటరుగా నమోదై ఉన్నప్పటికీ, ప్రస్తుత అర్హత కలిగిన వారు కూడా తాజా ఫారం-19 సమర్పించాలని సూచించారు. ఫారం-19ను కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని తెలిపారు. వివరాలకు టోల్‌ఫ్రీ 1950ను లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

ఓటరు జాబితా షెడ్యూల్: ముసాయిదా ఓటరు జాబితా నవంబర్ 25న ప్రచురించనున్నట్లు, క్లెయిమ్స్‌, అభ్యంతరాలను డిసెంబర్ 10 వరకు స్వీకరిస్తామని, తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు డీఆర్వో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular