స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం: రేపు జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్., ఆర్ముడ్ రిజర్వు పరిసరాలు, వేడుకల వేదిక, ప్రముఖుల భద్రతా ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది కవాతు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాక సమయం, జెండా వందనం, అతిథుల గౌరవ వందనం తదితర కార్యక్రమాల నిర్వహణపై కమిషనర్ సమీక్షించారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో వెళ్లి ఆర్ముడ్ రిజర్వు బలగాలు, సివిల్ పోలీసులు, హోంగార్డుల కవాతు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు కవాతు సాధనను వీక్షించి వివిధ విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేడుకల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కేటాయించిన సమయం, ఇతర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజల కోసం ఏర్పాటు చేయనున్న గ్యాలరీలు, వారికి కల్పించాల్సిన భద్రతా సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలీసు కమిషనర్ ఆదేశించారు.

