Homeఎడిటోరియల్స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రత

స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రత

రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం పర్యవేక్షణ: ఎస్పీ ఉమామహేశ్వర్

చీరాల, సెప్టెంబర్ 27 :  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు ఆదివారం చీరాల సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. అనంతరం చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల భద్రతపై సమీక్షించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. పేరాల ఏఆర్‌ఎం హైస్కూల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డులను క్రమం తప్పకుండా సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం నిఘా ఉంచామని, వారు ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శించడం, పోలీస్ స్టేషన్ల పనితీరును సమీక్షించడం, స్థానిక పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. తాను కూడా ఆకస్మికంగా వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్, చీరాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్, టూటౌన్ సీఐ శశికుమార్, చీరాల రూరల్ సీఐ సుధాకర్, వన్‌టౌన్, టూటౌన్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular