Homeక్రైమ్ న్యూస్దొంగతనం కేసును ఛేదించిన చీర

దొంగతనం కేసును ఛేదించిన చీర

దొంగతనం కేసును ఛేదించిన చీర

ఫంక్షన్‌కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ.. గుర్తించిన బాధితురాలు

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      హైదరాబాద్, ఆగష్టు 15: మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసును ఓ చీర పట్టించింది. దొంగిలించిన చీరను ఓ మహిళ ఫంక్షన్‌కు కట్టుకుని రావడంతో బాధితురాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

బండ్లగూడ జాగీర్‌ వినాయక్‌నగర్‌ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి యాదయ్య నివాసం ఉంటున్నాడు. 2023 సెప్టెంబర్‌ 16న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యాదయ్య.. సెప్టెంబర్‌ 19న ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో రూ.2.50 లక్షల నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు యాదయ్య ఇంటి వెనుక నివసించే స్వప్న (29) అనే మహిళ చీర కట్టుకుని వచ్చింది. ఆ చీర తమ ఇంట్లో చోరీకి గురైనదేనని యాదయ్య భార్య గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములు (35)ను అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత ఆ చీర తనదేనని స్వప్న బుకాయించినప్పటికీ, పోలీసుల విచారణలో చివరకు యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేసినట్లు దంపతులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్వప్న, రాములును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్ల క్రితం నమోదైన దొంగతనం కేసు చివరకు ఓ చీర ఆధారంగా ఛేదించబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular