ఈ నెల 17న విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
18న నూతన కార్యకవర్గ సమావేశం.. కీలక తీర్మానాలపై చర్చ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగష్టు 16: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం విశాఖపట్నం రానున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. 18వ తేదీన నిర్వహించనున్న నూతన కార్యకవర్గ సమావేశానికి నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారని వెల్లడించారు.
ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిపై, నీటిపారుదల ప్రాజెక్టులపై రెండు ప్రధాన తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. జాతీయ అధ్యక్షుడితో పాటు బీఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ గ్రోత్‌ను సాధిస్తున్నామని మాధవ్ అన్నారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో విశాఖకు 25 శాతానికి పైగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వరంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. మరో వారంలో గోదావరి నీరు ఉత్తరాంధ్ర నేలను తాకబోతున్నాయని చెప్పారు.
విశాఖలో గూగుల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టులు కూడా రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్న తరుణంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖకు రావడం సంతోషకరమని మాధవ్ అన్నారు.
విశాఖ విమానాశ్రయం మూసివేత ప్రాంతవాసిగా తనకు కొంత బాధ కలిగిస్తోందని, అయితే విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నామని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.

