పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో సోమవారం పీజీఆర్ఎస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 16: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 17న పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, పెందుర్తి, గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
నగరంలోని పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, నీటి సరఫరా, వీధి దీపాలు, హార్టికల్చర్, రెవెన్యూ, యూసీడీ, ఇంజినీరింగ్ తదితర జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని కమిషనర్ సూచించారు.
ప్రత్యేకంగా మారిన జోన్ కార్యాలయాలు
వెస్ట్ జోన్: 52వ వార్డులోని ఎన్ఏడీ కొత్త రోడ్డు, గౌరీనగర్‌లో ఉన్న పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు.
నార్త్ జోన్: 51వ వార్డులోని మాధవధార ఉడా లేఅవుట్, ఆర్టీఏ ఆఫీస్ రోడ్డు, పంప్‌హౌస్ వెనుక ఉన్న ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది.
అగనంపూడి జోన్: 85వ వార్డులోని పెదమడక, శివాలయం రోడ్డులో వినాయక టెంపుల్ సమీపంలోని రాజీవ్‌గాంధీ కళ్యాణ మండపంలో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు.
ఈ మూడు జోన్ కార్యాలయాల వేదికలు మారినందున ఆయా ప్రాంతాల ప్రజలు కొత్త ప్రదేశాలను గమనించాలని జీవీఎంసీ కమిషనర్ కోరారు. మిగిలిన అన్ని జోన్ల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాస్థానంలోనే జరుగుతుందని తెలిపారు.

