Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంలేబర్‌ కోడ్స్‌తో కార్మిక హక్కులకు నష్టం

లేబర్‌ కోడ్స్‌తో కార్మిక హక్కులకు నష్టం

 

లేబర్‌ కోడ్స్‌తో కార్మిక హక్కులకు నష్టం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 16: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ వల్ల కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కరిమలియన్‌ అన్నారు. కార్మిక సంఘాలన్నీ ఈ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.

విశాఖ మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన లేబర్‌ కోడ్స్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కొత్త చట్టాల అమలుతో కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సంఘం ఏర్పాటు చేసుకునే హక్కును కఠినతరం చేయడంతో పాటు, యాజమాన్యాలతో బేరసారాలు జరిపే హక్కుపైనా పరిమితులు విధించారని విమర్శించారు.

గతంలో అత్యవసర సేవలకు మాత్రమే సమ్మెకు 14 రోజుల ముందస్తు నోటీసు నిబంధన ఉండేదని, ప్రస్తుతం అన్ని సంస్థల్లోనూ సమ్మెకు ముందస్తు నోటీసు తప్పనిసరి చేశారని పేర్కొన్నారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లో కన్సిలియేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సమ్మె చేయకూడదనే నిబంధనలు తీసుకొచ్చారని, వీటివల్ల కార్మిక సంఘాలపై, నాయకులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.

కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలను మూసివేయడానికి గతంలో ఉన్నట్లుగా ప్రభుత్వ ముందస్తు అనుమతులు అవసరం లేని విధంగా నిబంధనలు మార్చారని కరిమలియన్‌ తెలిపారు. లేబర్‌ కోడ్స్‌ వల్ల కార్మికులందరికీ ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చేస్తున్న వాదన వాస్తవానికి భిన్నంగా ఉందన్నారు.

కార్మిక చట్టాల్లో మార్పులు యాజమాన్యాలు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా మారి కార్మికులపై దోపిడీకి అవకాశం కల్పించే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. మారిన పరిస్థితుల్లో కార్మికులను యాజమాన్యాల ఆధీనంలో ఉంచే విధంగా లేబర్‌ కోడ్స్‌ రూపొందించబడ్డాయని విమర్శించారు. కార్మిక హక్కులను పరిరక్షించేందుకు లేబర్‌ కోడ్స్‌ రద్దు కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ వర్క్‌షాప్‌కు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు యు. రామస్వామి అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌. నర్సింగరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ఎం. శ్రీనివాస్‌, ఆర్‌.కె.ఎస్‌.వి. కుమార్‌తో పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోర్ట్‌ అథారిటీ, బీహెచ్‌ఈఎల్‌, రక్షణ రంగం, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌, ఎన్‌టీపీసీ, రైల్వే తదితర రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular