దక్షిణ వైఎస్సార్సీపీలో మత్స్యకారుల భారీ చేరికలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 19: దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డుకు చెందిన పలువురు మత్స్యకారులు వైఎస్సార్సీపీలో భారీగా చేరారు. ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజు ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం తొలి నుంచి చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు కోసం తరలించిన ప్రాంతాల్లో మత్స్యకారుల జీవనాధారం, హక్కులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మత్స్యకారుల భూములపై పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తీసుకున్నారని, అదే ప్రాంతంలో తరతరాలుగా జీవించిన మత్స్యకారులకు ఎప్పుడైనా బ్యాంకు రుణాలు అందించారా అని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సముద్రాన్ని నమ్ముకుని జీవించే మత్స్యకారులకు తగిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన మత్స్యకారులు ఉద్యోగాలు అడిగితే అవమానకరంగా సమాధానాలు ఇవ్వడం బాధాకరమన్నారు.
ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు నివసించే ప్రాంతాలను కొందరు తక్కువ ధరలకు కొనుగోలు చేసుకున్నారని వాసుపల్లి ఆరోపించారు. మత్స్యకారుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని వారిని ఉపయోగించుకుని వదిలేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
మత్స్యకారులకు అన్యాయం జరిగితే తాను వారి తరఫున గట్టిగా ప్రశ్నిస్తానని వాసుపల్లి గణేష్కుమార్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భారత్, వార్డు అధ్యక్షుడు నీలపు సర్వేశ్వరరెడ్డి, గురజరాపు రవి, జిల్లా వాలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా స్టూడెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్, జిల్లా బీసీ సెల్ కమిటీ సభ్యుడు దూడ తాతారావు, జిల్లా మత్స్యకార నాయకులు దూడ అచ్చుతా, గంటల డేడు, మెరుగు ఎల్లజీ, సుగాలా నూకరాజు రాజు, వాసుపల్లి నరసింహులు, వార్డు మత్స్యకార నాయకులు అంబతి అప్పలరాజు, దాసరి నరసింగ్రావు, దాసరి ఎల్లయ్య, సూరపతి నరసింగరావు, పిల్లి సత్తిబాబు, చేపల నూకరాజు, చేపల రాజు తదితరులు పాల్గొన్నారు.

