మూగ విద్యార్థులకు నచ్చిన దుస్తులు కానుకగా అందించిన డాక్టర్ డేగల నాగేంద్ర
మెగా బ్రదర్స్ సేవా స్ఫూర్తితో ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు
కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్, ఆగస్టు 23: జనసేన సీనియర్ నాయకులు, డా. డేగల నాగేంద్ర పెద్ద కుమార్తె చిరంజీవి లాస్య నాయుడు 10వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలు కేవలం కుటుంబ వేడుకగా కాకుండా, మూగ, చెవిటి విద్యార్థుల ముఖాల్లో ఆనందాన్ని నింపేలా సేవా కార్యక్రమంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతాప్‌నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ పాఠశాల విద్యార్థుల సమక్షంలో జుడియో షాపింగ్ మాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. లాస్య నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని డాక్టర్ డేగల నాగేంద్ర ప్రత్యేకంగా రెడ్‌క్రాస్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మూగ, చెవిటి విద్యార్థులను జుడియో షాపింగ్ మాల్‌కు తీసుకువచ్చారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారికి నచ్చిన నూతన దుస్తులను స్వయంగా ఎంపిక చేసి కొనుగోలు చేశారు.
అనంతరం విద్యార్థుల కోసం ఆ దుస్తులను ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాక్‌లుగా సిద్ధం చేసి లాస్య నాయుడు, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. తమకు నచ్చిన దుస్తులు కానుకగా అందుకోవడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో ముడిపెట్టి నిర్వహించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.
విద్యార్థుల మధ్య లాస్య పుట్టినరోజు
అనంతరం రెడ్‌క్రాస్ పాఠశాల విద్యార్థుల మధ్య లాస్య నాయుడు 10వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో లాస్య నాయుడు భారీ కేక్‌ను కట్ చేశారు. కేక్‌ను విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ లాస్య నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
పుట్టినరోజు వేడుకలను పిల్లల మధ్య, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ ఉదయ శ్రీనివాస్ అన్నారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆనందాన్ని పంచేలా లాస్య నాయుడు పుట్టినరోజును నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు
లాస్య నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని డాక్టర్ డేగల నాగేంద్ర ప్రతి ఏడాది రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మూగ, చెవిటి విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా నూతన దుస్తులను అందించి, వారితో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా జనసేన నాయకులు డా.డేగల నాగేంద్ర మాట్లాడుతూ.. లాస్య పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా పేదలు, ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సంతోషాన్ని కలిగించేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తన సంపాదనలో 20 శాతం ఆపదలో ఉన్నవారికి, పేదలకు అండగా నిలిచేందుకు వినియోగిస్తున్నానని చెప్పారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన … అన్న చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ఫూర్తితో మరింత బలపడిందన్నారు.
తన చివరి శ్వాస వరకు పేదలకు సాధ్యమైనంత మేరకు సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తానని డాక్టర్ నాగేంద్ర స్పష్టం చేశారు. లాస్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆనందాన్ని పంచడంతో పాటు, సమాజం పట్ల బాధ్యతను చాటిచెప్పేలా నిలిచిందన్నారు.
ఘనంగా పాల్గొన్న కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు
కార్యక్రమంలో లాస్య నాయుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నాయనమ్మ, తాతయ్యలు, బంధనపూడి మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణి సత్యనారాయణ, కాజులూరు, బంధనపూడి, రామచంద్రపురం ప్రాంతాలకు చెందిన జనసేన నాయకులు, డీఎన్‌ఎఫ్ సంస్థ మిత్ర బృందం, డాక్టర్ నాగేంద్ర అభిమానులు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లాస్య నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు ఆశీర్వాదాలు అందించారు. లాస్య నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టిన ఈ సేవా కార్యక్రమం విద్యార్థులలో సంతోషాన్ని నింపడంతో పాటు, పుట్టినరోజు వేడుకలను సామాజిక బాధ్యతతో ముడిపెట్టిన ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

