Homeతెలంగాణఖమ్మంమేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి

మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 25:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టుమిషన్లను 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మేరు కులస్తులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని మేరు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వరరావు కోరారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కుట్టుమిషన్ ఆధారంగా కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్న మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలను మేరు సంఘం నాయకులు కోరినట్లు వెల్లడించారు.ప్రభుత్వం నుంచి 100 శాతం సబ్సిడీపై అందించే కుట్టుమిషన్లలో మేరు కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వం తరఫున హామీ లభించిందని నిమ్మల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల మేరు సంఘం మండల కమిటీలు, జిల్లా కమిటీ బాధ్యులు, పట్టణ, వార్డు కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ప్రతి కుటుంబం (రేషన్ కార్డుకు) ఒకరు చొప్పున కుట్టుమిషన్ కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని, దరఖాస్తుదారుల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేసి మండలాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కుట్టుమిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన వారు tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుట్టుమిషన్ల పంపిణీ ద్వారా మేరు కులస్తుల సంప్రదాయ కులవృత్తికి మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవుతాయని నిమ్మల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular