“చరిత్ర మరచిన మహిళలకు అక్షర నివాళి!”
బహుజన మహిళల సేవలను వెలుగులోకి తెచ్చిన డా. తెన్నేటి జయరాజు
‘భారతీయ బహుజన మహిళా ప్రముఖులు’ గ్రంథావిష్కరణలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం, పెన్ పవర్ ఆగస్టు 29:
చరిత్రలో గుర్తింపునకు నోచుకోని అనేక మంది బహుజన మహిళల జీవితాలు, సేవలు, విజయాలను వెలుగులోకి తీసుకువచ్చి వారికి చరిత్రలో సముచిత స్థానం కల్పించే ప్రయత్నం అభినందనీయమని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అన్నారు.
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం శ్రీమతి తెన్నేటి పద్మావతి మూడో వర్ధంతి స్మారక కార్యక్రమం, ‘భారతీయ బహుజన మహిళా ప్రముఖులు’ గ్రంథావిష్కరణ, ప్రముఖుల సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం, గుర్తింపు లభించని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా చరిత్రలో మరుగునపడిన మహిళల సేవలు, విజయాలను వెలికితీసి పుస్తక రూపంలో అందించడం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. డా. తెన్నేటి జయరాజు రచించిన ‘భారతీయ బహుజన మహిళా ప్రముఖులు’ గ్రంథం మహిళల సేవలను సమాజానికి పరిచయం చేయడంలో కీలకమైన ప్రయత్నమని బాగ్చి అన్నారు. మహిళల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను రచయిత తీసుకోవడం అభినందనీయమన్నారు.

కార్యక్రమానికి డా. తెన్నేటి జయరాజు అధ్యక్షత వహించారు. మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. వీరయ్య, విశ్రాంత పోలీస్ సూపరింటెండెంట్ డా. కె. రాజా శిఖామణి, విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జె.వి. సత్యనారాయణ మూర్తి, ఏపీ డీహెచ్‌పీఎస్ అధ్యక్షుడు జె.వి. ప్రభాకర్, ట్రినిటీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ సీఈఓ డా. ఎస్.డి. శామ్యూల్ రాజు, విశ్రాంత సీఎీజీఎం టీకేఎస్ఆర్ టాగోర్, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు, డా. ఆర్. అరవింద్, బి. కల్యాణరావు, కె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తకంపై డా. కె. శ్రీనివాస్, డా. ఎం. శ్రీనివాస్, డా. అదురి శామ్యూల్ జాన్, కాకర రమణ సమీక్షలు నిర్వహించారు. ప్రముఖ బహుజన రచయితలు టీకేఎస్ఆర్ టాగోర్, అట్టాడ అప్పలనాయుడు, వల్లంపాటి సోలమన్ రాజు, చి.జి.వి. ప్రసాద్, డా. పి.వి. రామ్, యార్లగడ్డ హేమంత్ కుమార్, యంత్రపాటి లిల్లీ ప్రియదర్శినిలను ఘనంగా సన్మానించారు.

అనంతరం ‘మహిళా సాధికారత – అనుసంధానం కానివారిని అనుసంధానించడం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన శ్రీమతి బి. సుజాత ముఖ్య అతిథిగా పాల్గొనగా, డా. తెన్నేటి ప్రగతి, ప్రొఫెసర్ పవిత్ర కొండేటి, ప్రొఫెసర్ సి. ప్రజ్ఞ, ఎన్. స్వర్ణలత, ఎస్‌కే సలీమా, ఈ. వేమేశ్వరి, లక్ష్మి స్వేరో తదితరులు మహిళా సాధికారతపై ప్రసంగించారు. శ్రీమతి తెన్నేటి పద్మావతి సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు స్మరించుకున్నారు. మహిళల కోసం ఆమె చేసిన రచనలు, సహాయ కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పవిత్ర ప్రగతి సందేశం పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, మహిళా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చరిత్రలో మరుగునపడిన బహుజన మహిళల జీవితాలు, సేవలు, విజయాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రూపొందిన ఈ గ్రంథం భవిష్యత్ తరాలకు విలువైన స్ఫూర్తి అందిస్తుందని వక్తలు పేర్కొన్నారు.

