- ఏలేశ్వరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: స్థానిక మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు తలవంచి ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్. నాగ నరసింహ రావు కు స్థానిక నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఏలేశ్వరం మున్సిపల్ ఆఫీస్ కు ఎన్నికల కమిషన్ విధులు పై నాగ నరసింహారావు విచ్చేశారు. ఈ సందర్భంగా పైల సుభాష్ చంద్ర బోస్ మున్సిపల్ కమిషనర్ ఏ ఎన్ జ్ఞాన ప్రకాష్, ఆర్డీ ఎం ఏ లకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల కోసం అర్జీదారులు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే ఇచ్చే పెన్షన్ అర్జీ కాగితాలపై స్థానిక టిడిపి వార్డ్ ఇన్చార్జిల సంతకం చేసి తీసుకురావాలని నిబంధన పెట్టారని ఆరోపించారు. ఎన్నికల నిబంధన ప్రకారం, స్థానికంగా అధికారంలో లేని(కౌన్సిలర్లకు) టిడిపి అధికార పార్టీ కి చెందిన వార్డ్ పార్టీ ఇన్చార్జి లకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి అధికారులు వ్యవహరించడం అన్యాయమని అన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్ లకే దరఖాస్తుపై సంతకం చేసే అధికారం లేదు. అయినప్పటికీ వారికి సంతకం పెట్టే అధికారం ఎవరిచ్చారు అని అన్నారు. సదరు విషయంపై విచారణ చేసి దరఖాస్తులను పరిశీలించి, ఈ చర్యలకు పూనుకున్న అధికారులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని బోస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

