మందులు, వైద్య సామగ్రి అందజేత.. సేవా కార్యక్రమాలకు అండగా ఉంటామని హామీ
వేటపాలెం, సెప్టెంబర్ 20 (పెన్ పవర్) : పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పమిడాల చెంచయ్య–రాఘవమ్మ మెమోరియల్ వైద్య శిబిరానికి జనసేన నాయకుడు వినయ్ గౌడ్ చేయూతనందించారు. ఆదివారం జనసేన నాయకుడు పసుపులేటి సాయితో కలిసి శిబిరం వ్యవస్థాపకుడు పమిడాల సుబ్బారావును కలసి మందులు, డ్రెస్సింగ్ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు వారిని శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. వైద్య శిబిరానికి అవసరమైన సహాయాన్ని తనవంతుగా అందిస్తానని భరోసా ఇచ్చారు. పసుపులేటి సాయి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పమిడాల సుబ్బారావు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. పమిడాల సుబ్బారావు మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం శిబిరానికి వస్తుంటారని పేర్కొన్నారు. వినయ్ గౌడ్, పసుపులేటి సాయి అందించిన మందులు, వైద్య సామగ్రి పేద రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సేవా కార్యక్రమానికి చేయూతనందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు, రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

