విద్యావ్యవస్థ బలోపేతానికి మంత్రి నారా లోకేష్ విశేష కృషి
– ఈపూరుపాలెం జెడ్పీహెచ్ఎస్లో ‘సేవ సర్వ అభియాన్’
– కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
చీరాల రూరల్ సెప్టెంబర్ 24 (పెన్ పవర్) : దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా అభివృద్ధి చెందిన దేశం తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనలో విద్యావ్యవస్థదే కీలక పాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈపూరుపాలెంలోని జడ్పీహెచ్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకట రమణారావు ఆధ్వర్యంలో ‘సేవ సర్వ అభియాన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో వారు కనబరిచిన ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత వైస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను మూసివేసి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఆ తప్పులను సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం 16 వేల పోస్టులతో ‘మెగా డీఎస్సీ’ ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే, కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుల్లో కేసులు వేస్తూ ఈ డీఎస్సీని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న రౌడీ మూకల చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులకు దిగితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాధవ్ హెచ్చరించారు.
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మారుతున్న బడులు
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతంగా పనిచేస్తున్నారని మాధవ్ కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. స్మార్ట్ క్లాసులు, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాంలు, పుస్తకాల పంపిణీతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఎన్ ఈ పి 2020 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వంలో ప్రపంచ స్థాయికి భారత్
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరించాలన్న లక్ష్యం దిశగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే పాఠశాలల్లో ఇలాంటి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయన సుదీర్ఘకాలం పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ దేశాన్ని మరింత పురోగతి వైపు నడిపించాలని మాధవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి యువ మోర్చా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

