Homeఆంధ్రప్రదేశ్పోలవరం30 కేజీల గంజాయి స్వాధీనం...

30 కేజీల గంజాయి స్వాధీనం…

అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు అరెస్ట్.. వాహనాలు, మొబైల్‌ ఫోన్లు సీజ్…

అడ్డతీగల, పెన్ పవర్, అక్టోబర్ 02;
అడ్డతీగల మండలం వేటమామిడి శివారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. సీఐ ఎం. గజేంద్ర కుమార్, ఈగల్ టీమ్ పర్యవేక్షణలో ఎస్‌ఐ బి. వినోద్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 1న మధ్యాహ్నం వేటమామిడి శివారులోని జీడిమామిడి తోట పక్క రహదారిపై గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం గెజిటెడ్‌ అధికారి, అడ్డతీగల తహసీల్దార్‌ కె. తేజస్విని, వీఆర్వో బెత్తం శిరీష, వీఆర్ఐ అరగాటి వెంకటరెడ్డి సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం వైపు నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, హ్యుందాయ్‌ ఆరా కారులో వచ్చిన వ్యక్తులు పోలీసులను గమనించి వెనక్కి తిరిగి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు అప్రమత్తమై వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అరవింద్‌ అనే వ్యక్తి బ్యాగును వదిలి అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రంపచోడవరం డి.ఎస్.పి అష్రూఫ్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపిన వివరాల ప్రకారం
అరెస్టయిన వారిలో బెంగళూరుకు చెందిన సునీల్‌ కృష్ణ (30), భరత్‌ పుష్పరాజ్‌ (28), గురుప్రసాద్‌ రాము (34), కృష్ణా జిల్లాకు చెందిన చెల్లి సుభాష్‌ మణికంట (23), షేక్‌ షాయిదా (25), నాందేటి సందేశ్‌ (18) ఉన్నారు. ప్రాథమిక విచారణలో ధారకొండ పరిసర ప్రాంతాల్లో మున్నా అనే వ్యక్తి వద్ద 30 కేజీల గంజాయిని రూ.30 వేలకుగాను కొనుగోలు చేసి, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
పోలీసులు నిందితుల నుంచి 5 కేజీల చొప్పున ప్యాక్‌ చేసిన ఆరు ప్యాకెట్లలో మొత్తం 30 కేజీల గంజాయి, కర్ణాటక రిజిస్ట్రేషన్‌ గల హ్యుందాయ్‌ ఆరా కారు, బజాజ్‌ పల్సర్‌ 220 సీసీ, కేటీఎం డ్యూక్‌ 125 సీసీ ద్విచక్ర వాహనాలు, నాలుగు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి గంజాయిని సీజ్‌ చేసిన పోలీసులు, ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టయిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న అరవింద్‌, ధారకొండ రాళ్లగడ్డకు చెందిన మున్నా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular