సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల విషయంలో చేతివాటం?
బాధితుల నుంచి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు
ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 4:
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇప్పిస్తానని చెప్పి గ్రామానికి చెందిన తోటపల్లి వెంకటేశ్వర్లు కొంతమంది బాధితుల నుంచి నగదు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నారని, ఇప్పటి వరకు సుమారు ఎనిమిది మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నప్పటికీ, చెక్కుల మంజూరు విషయంలో స్పష్టత లేకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గ్రామంలో మరికొంతమంది వద్ద కూడా ఇదే విధంగా నగదు తీసుకున్నట్లు సమాచారం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి వివరణ, అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు. సీఎంఆర్‌ఎఫ్ వంటి ప్రభుత్వ సహాయ పథకాల విషయంలో నగదు వసూళ్లకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

