Homeతాజా సమాచారంఫుట్‌పాత్ మింగేశారు.. రోడ్లను వదల్లేదు

ఫుట్‌పాత్ మింగేశారు.. రోడ్లను వదల్లేదు

ఫుట్‌పాత్ మింగేశారు.. రోడ్లను వదల్లేదు

నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద యథేచ్ఛగా ఆక్రమణలు

ఫుడ్‌కోర్టులతో ట్రాఫిక్ జామ్‌లు

తరచూ ప్రమాదాలు

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం..

నెలవారీ మామూళ్ల ఆరోపణలు

కాప్రా, పెన్ పవర్, నవంబరు 5:

ఉప్పల్ నియోజకవర్గం నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ పరిసర ప్రాంతంలో ఫుట్‌పాత్ ఆక్రమణలు నానాటికీ విస్తరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను కొందరు వ్యాపారులు ఆక్రమించి ఫుడ్‌కోర్టులు, ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో ప్రజలకు నడిచే దారి లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఫుడ్‌కోర్టుల వద్ద భారీ వాహనాలను రోడ్లపై నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఎక్కడ?

ఫుట్‌పాత్ ఆక్రమణలు బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మామూళ్ల ఆరోపణలపై విచారణ జరపాలి

ఆక్రమణదారుల నుంచి కొందరు కింది స్థాయి సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నందువల్లే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, పాదచారుల భద్రతతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular