విద్యార్థుల భవిష్యత్తుకు చదువే పునాది
తల్లిదండ్రుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, పెన్ పవర్, నవంబరు 5:
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఎమ్మెల్యే బండారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం లో విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలు, క్రమశిక్షణ, ఉన్నత విద్య ప్రాధాన్యతపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
గణిత ఉపాధ్యాయుడిని నియమించాలి
సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో గణిత శాస్త్ర బోధనకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన బండారి లక్ష్మారెడ్డి సమస్యను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్,గుండారపు శ్రీనివాస్ రెడ్డి,గొల్లూరి అంజయ్య, నాయకులు మల్లేష్ గౌడ్, గుమ్మడి జంపాల్ రెడ్డి, ప్రసాద్, హరినాథ్ రెడ్డి, భూపాల్ గౌడ్, చారి, దేవేందర్ కుమార్, దండెం నరేందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

