రూ.70 వేల అప్పు.. రూ.4 లక్షల వసూలు!
అధిక వడ్డీతో వేధింపులు.. ఏడుగురు అరెస్ట్
ఎల్బీనగర్, పెన్ పవర్ నవంబర్ 05:
అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలకు రుణాలిస్తూ, అప్పులు చెల్లించలేని వారిని బెదిరింపులకు గురిచేస్తున్న అక్రమ ఫైనాన్స్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్, ఎల్బీనగర్ పోలీసులు సంయుక్తంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటికే ముగ్గురు అరెస్టు కాగా, తాజా అరెస్టులతో ఈ కేసులో పట్టుబడిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రచారం చేస్తూ అత్యవసరంగా డబ్బు అవసరమైన వారిని ముఠా లక్ష్యంగా చేసుకుంది. రూ.లక్ష అప్పు కావాలంటే రూ.70 వేలు మాత్రమే ఇచ్చి, రూ.2 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాయించుకునేది. వడ్డీపై వడ్డీ విధిస్తూ రూ.70 వేల అప్పును ఏకంగా రూ.4 లక్షలకు పెంచి వసూలు చేసేందుకు బాధితులను వేధించేది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి నుంచి ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఓ వృద్ధ మహిళా వైద్యురాలిని సైతం మోసగించి ఆమెకు చెందిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నిందితుల నుంచి రెండు కార్లు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, 25 ప్రామిసరీ నోట్లు, 22 ఖాళీ చెక్కులు, భూమికి సంబంధించిన పత్రాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఏడుగురు బాధితులను గుర్తించగా, మరో 20 మంది వివరాలను సేకరిస్తున్నారు. అధిక వడ్డీ వసూళ్లు, అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

