గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
కూటమి నేతలు, గ్రామ పెద్దల మద్దతుతో ముందడుగు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మౌలిక వసతుల కల్పనకు హామీ
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 24:
గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ఆలోచన.. ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టుదల.. ఉన్నత విద్యను అభ్యసించిన మహిళగా గ్రామానికి కొత్త దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో పోతుల శ్రీలక్ష్మి గనిరాజు శలపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. బీటెక్ చదువుకున్న మహిళగా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె, కూటమి అభ్యర్థిగా గ్రామ ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. రాజకీయ మద్దతుతో పాటు గ్రామ పెద్దల ప్రోత్సాహం తనకు కొండంత బలమని ఆమె పేర్కొంటున్నారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌తో పాటు శలపాక జనసేన నాయకులు మాధవరపు చినబాబు, మాధవరపు దొరబాబు, డేగల దొరబాబు, గరగ అర్జిబాబు, కామిరెడ్డి చక్రరావు, దేవ్ నాగబాబు, గరగ చంద్రబాబు, పోతురాజు భీమారావు తదితర నాయకులు, గ్రామ పెద్దల మద్దతుతో ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
గ్రామ సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం
శలపాక గ్రామపంచాయతీ పరిధిలోని శలపాక, మొగలపాలెం, డేగలపేట గ్రామాల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని శ్రీలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, అవసరమైన నిధులు, అభివృద్ధి పనులు సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా గ్రామంలోని స్మశాన వాటికలకు వెళ్లే రహదారుల సమస్యలు పరిష్కరించడం, వీధిలైట్లు ఏర్పాటు చేయడం, పారిశుధ్యం మెరుగుపరచడం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి భాగస్వామ్యంతో పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు.
కత్తెర గుర్తుపై ఓటేయండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి
కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని శలపాక, మొగలపాలెం, డేగలపేట గ్రామాల ఓటర్లను శ్రీలక్ష్మి పేరుపేరునా కోరుతున్నారు.
”స్వార్థం కాదు నా లక్ష్యం.. పంచాయతీ అభివృద్ధే నా ధ్యేయం. బీటెక్ విద్యను అభ్యసించిన మహిళగా గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో తొలిసారిగా ఎన్నికల బరిలోకి వచ్చాను. ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తే వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. గ్రామంలోని ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. నా గెలుపుకు గ్రామ ప్రజలే మలుపు కావాలి” అని శ్రీలక్ష్మి మీడియాతో పేర్కొన్నారు.
విద్యావంతురాలిగా గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న పోతుల శ్రీలక్ష్మి గనిరాజు ప్రచారం ప్రస్తుతం శలపాక గ్రామపంచాయతీ పరిధిలో చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజల ఆదరణ, నాయకుల మద్దతు తన విజయానికి బాటలు వేస్తాయనే ఆశాభావంతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.



