Homeఆంధ్రప్రదేశ్కాకినాడకోలంక సర్పంచ్‌ పోరులో బొండా వెంకన్న..

కోలంక సర్పంచ్‌ పోరులో బొండా వెంకన్న..

గ్రామాభివృద్ధే ప్రధాన అజెండా

తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి హామీ

40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రజల్లోకి

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండలంలోని కోలంక గ్రామపంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. సర్పంచ్‌ పదవికి కూటమి మద్దతుతో బొండా వెంకన్న, బూరెల పెద్దకాపు పోటీ పడుతుండటంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ పోటీపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, గ్రామస్థులతో ఉన్న అనుబంధంతో బొండా వెంకన్న ఎన్నికల ప్రచారంలో తన వాదనను ప్రజల ముందుంచుతున్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం, జనసేన నాయకుడు పోలిశెట్టి చంద్రశేఖర్ తదితర కూటమి నాయకులతో తనకు ఉన్న పరిచయాలు, వారి మద్దతు తనకు బలాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన కూటమి నాయకులకు, ఆశీస్సులు అందించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బొండా వెంకన్న మాట్లాడుతూ పదవులు అలంకారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడాలన్నదే తన అభిమతమన్నారు. కోలంక గ్రామంలో చాలాకాలంగా ఉన్న తాగునీటి సమస్య, అంతర్గత రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వీధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థులు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే అందరి సహకారంతో కోలంక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తనకు ఉన్న 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బొండా వెంకన్న వెల్లడించారు. ‘సేవే లక్ష్యం.. గ్రామ అభివృద్ధే ముఖ్యం’ అనే నినాదంతో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular