ప్రజాసేవ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా అభ్యర్థుల హామీలు
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని జగన్నాథగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవికి పెమ్మనబోయిన కృష్ణ, కాకర్లపూడి గాంధీరాజు పోటీ పడుతుండటంతో గ్రామంలో ద్విముఖ పోటీ నెలకొంది. పార్టీలకు అతీతంగా గ్రామంలోని పలువురు నాయకులు, ప్రజలు తనకు మద్దతు తెలిపి సర్పంచ్‌గా పోటీ చేయాలని ప్రోత్సహించడంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు పెమ్మనబోయిన కృష్ణ తెలిపారు. గ్రామ నాయకుల సహకారం, ప్రజల అండదండలతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమన్నారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చానని, గ్రామస్తుల మద్దతు తనకు ఉందనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు.
మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాకర్లపూడి గాంధీరాజు సైతం గ్రామాభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య, వ్యక్తిగత మరుగుదొడ్ల కొరత, రహదారుల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని, గ్రామంలో రహదారుల నిర్మాణానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. తన సేవా కార్యక్రమాలను గుర్తించిన యువత తనకు మద్దతుగా నిలుస్తున్నారని గాంధీరాజు తెలిపారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. గతంలో ఆర్టీసీ శాఖలో విధులు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా ఉన్న తనను గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌గా పోటీ చేయాలని పలువురు ప్రోత్సహించారని చెప్పారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే పంచాయతీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరు అభ్యర్థులు గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధిని ప్రధాన అంశాలుగా ప్రస్తావిస్తుండటంతో జగన్నాథగిరి పంచాయతీ ఎన్నికలపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది.


