విద్యా సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం చిరస్మరణీయం
సైనిక్‌పురిలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సభ
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 28:
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలోని సకల వివక్షలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా సైనిక్ పురిలోని జ్యోతిరావు పూలే చౌరస్తాలో ఆయన విగ్రహం వద్ద సంస్మరణ సభ నిర్వహించారు.
సభకు ముందు స్ఫూర్తి గ్రూప్ గొడుగు యాదగిరిరావు, మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి, సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలకు విద్యను నిరాకరించారని అన్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా, బాలికల విద్య కోసం అనేక పాఠశాలలను స్థాపించారని గుర్తు చేశారు.
సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు విద్యను అందించడంతో పాటు సకల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం పూలేను తన గురువుగా అభివర్ణించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ కౌన్సిలర్, ప్రజాతంత్ర ఉద్యమ నాయకురాలు చల్లా లీలావతి మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న వివక్షలు, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పూలే మహోన్నత పోరాటం చేశారని అన్నారు. నేటి పాలకులు పూలే ఆశయాలను అనుసరిస్తున్నామని చెబుతూనే, అందుకు విరుద్ధమైన భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. ప్రజలను విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే డీలిమిటేషన్ బిల్లు, ఓటు హక్కును ప్రభావితం చేసే ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు జయరాజు, వంశరాజ్ మల్లేష్, భాస్కర్, గణేష్, ఇమామ్ పాషా, శ్రీమన్నారాయణ, సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. పాషా వందన సమర్పణతో సభ ముగిసింది. అనంతరం నాయకులు, కార్యకర్తలు పూలే విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.

