కాలంచెల్లిన ప్రభుత్వ పట్టాలకు రెవెన్యూ ప్రాధాన్యత..! ప్రశ్నిస్తే “పిట్ట కథలు”..
తహశీల్దార్ భరోసా..? లేఅవుట్ పట్టాల పేరుతో చకచకా అక్రమ నిర్మాణాలు..!
పాత పట్టాలు కట్టుకోవచ్చట..! తెలివిగా పరోక్షంగా సహకరిస్తున్న రెవెన్యూ..
కాలం చెల్లిన ప్రభుత్వ పట్టాలు.. క్రయ విక్రయాల నిబంధనలకు తిలోదకాలు..
పనికిమాలిన వ్యక్తుల సిఫార్సుల పేరుతో.. “లాభదాయకమైన” వ్యాపారమా..?
దుండిగల్ తహశీల్దార్‌కు గ్రూపులో..! ఆర్ఐకి పర్సనల్‌గా.! పంపించినా చర్యలు శూన్యం.
మరో రెండు నిర్మాణాల గురించి అడిగితే..! స్థానికుల పాత పట్టాలు ఉన్నాయని జవాబు..
గాగిల్లాపూర్ భూధాన్ భూమిలోనూ అక్రమ షెడ్లకు ప్రజాప్రతినిధి సిఫార్సులట..
డి.పోచంపల్లి సర్వే నెం.120లో “58-59” పేరుతో అక్రమ నిర్మాణాలకు సహకారం..
ఓవైపు సిఫార్సుల అమలు..! మరోవైపు అక్రమ నిర్మాణ దారులకు అండగా..!
దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరు పలు విమర్శలకు తావిస్తోంది.. “కంచే చేను మేసిన” చందంగా తయారైంది.. ప్రభుత్వ పట్టాల కాలపరిమితి- వాటి క్రయవిక్రయాల నిబంధనల గురించి తహశీల్దార్ స్థాయి అధికారికి కూడా అవగాహన లేకపోవడం బాధాకరం.. బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో అధికారుల కనుసన్నల్లో ఈ అక్రమ కట్టడాల యవ్వారం “మూడు బేస్మంట్‌లు- ఆరు అక్రమ నిర్మాణాలు”గా విరాజిల్లుతోంది..! రెవెన్యూ యంత్రాంగం భూ పరిరక్షణ కోసమా..? లేక కబ్జాదారుల ప్రలోభాలకు కట్టుబడి ప్రభుత్వ భూములు కట్టబెట్టడమా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.. దుండిగల్ మండలం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో సర్వే నెం.576 ప్రభుత్వ భూమిలో కాలం చెల్లిన ప్రభుత్వ పట్టాల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమని అధికారులే నిరూపిస్తున్నారు..
అటు గాగిల్లాపూర్ భూదాన్ భూమిలో భారీ అక్రమ షెడ్ల వ్యవహారం లోనూ, అధికారులకు కనీస అవగాహన లేదని స్పష్టమవుతుంది.. సిఫార్సులకు ఇచ్చిన ప్రాధాన్యత, జిల్లా కలెక్టర్ ఇచ్చిన ‘డి-నోటిఫికేషన్’కి ఇవ్వకపోవడం గమనార్హం.. ఒక జిల్లా కలెక్టర్ “డి-నోటిఫికేషన్”తో ’22-ఎ జాబితా’లో పెట్టిన భూదాన్ భూమిలో.. రెండు అక్రమ షెడ్ల నిర్మాణాలపై తహశీల్దార్ సానుభూతి పలు విమర్శలకు దారితీస్తుంది.. “పెన్ పవర్” దినపత్రికలో వరుస కథనాలతో సంబంధిత స్థానిక అధికారులు, జిల్లా అడిషనల కలెక్టర్(రెవెన్యూ) దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం..! ప్రస్తుత కలెక్టర్ చర్యలు తీసుకోవద్దని చెప్పారని రెవెన్యూ సిబ్బంది తమపై అధికారులకు చెబుతున్నారు. అది ఓ ప్రజా ప్రతినిధికి చెందిన షెడ్డు అని కూడా మండల అధికారులు తమ పైస్థాయి అధికారులకు చెప్పడం గమనార్హం.. ఇక్కడ హాస్యాస్పద విషయం ఏమిటంటే..! మేడ్చల్ జిల్లాలో అధికార యంత్రాంగం ఎవరు ఎవరికి “సుపీరియర్” ఎవరు ఎవరికి “సబార్డీనేట్” అనేది చర్చనీయాంశంగా మారింది..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 5:
ప్రభుత్వ ఉద్యోగం అంటే తమ పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న పదవి కాదు.. ప్రజలకు సేవకులుగా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు, ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా పారదర్శకత విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు మాత్రమే..! అయితే ఆ అర్ధాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తేటతెల్లం చేస్తోంది..

అధికారమనే ముసుగులో చట్టాలను, నిబంధనలను కాలరాస్తున్నారు.. సిఫార్సులకు- పాత పట్టాల నిర్మాణాలకు చట్టబద్దత కల్పించారా..? అంటే అదేమి లేదు..! “తానే రాజు- తానే మంత్రి” అనే నియంతృత్వ ధోరణితో విధులు నిర్వర్తించడాన్ని ఏమంటారో మీరే చెప్పాలి..! అధికార దుర్వినియోగం అనాలా..? లేక అధికారమే తప్పుదోవలో పయనిస్తోందా..? ఇందుకే కదా..! గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ పనితీరుతో “విఆర్‌వో-విఆర్ఏ”లను ఇతర శాఖలకు బదిలీ చేసింది..! అయినప్పటికీ ఇప్పుడు అదే విఆర్‌వోలను “జిపివో”(గ్రామ పాలనా అధికారి)ల పేరుతో తీసుకుని..! మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.. మండలానికి సుమారు “3 నుండి 5 వరకు” జిపివోల నియామకం జరిగింది.. అయితే ఆ జిపివోలు ఏం చేస్తున్నారు..? అక్రమ నిర్మాణాల వద్దకు పదే పదే వెళ్తున్నా చర్యలు చేపట్టక పోవడానికి కారణం..? మరోవైపు తహశీల్దార్, ఆర్ఐల ఆదేశానుసారమే చర్యలు తీసుకోలేక పోతున్నారని అనుకోవాలా..? లేక “తిలాపాపం తలాపిడికెడు” అన్న చందంగా వ్యవహరిస్తున్నారని భావించాలా..?


