మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-చింతకాయల పద్మావతి
నర్సీపట్నం, పెన్ పవర్ :

మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి స్పష్టం చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం, మెప్మా మరియు ఎన్ఈసీసీ సంయుక్తంగా చేపట్టిన ‘ఎగ్ కార్ట్’ పథకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, ప్రతి మహిళా సొంత కాళ్లపై నిలబడాలనే సదుద్దేశంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లాకు 10 ఎగ్ కార్టులు మంజూరు కాగా, నర్సీపట్నంలో ఐదుగురు అర్హులైన ఎస్.జి.హెచ్ మహిళలకు వీటిని పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. లబ్ధిదారులకు ₹35,000 విలువైన ఎగ్ కార్ట్, ₹15,000 విలువైన వంట సామాగ్రితో కలిపి మొత్తం ₹50,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పద్మావతి వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె దిశానిర్దేశం చేశారు. వ్యాపారం చేసే క్రమంలో ప్రజల ఆరోగ్యంతో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, వంటకాల్లో ఎలాంటి కృత్రిమ రంగులు కలపకుండా, నాణ్యమైన నూనెలు వాడి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని పద్మావతి లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దనిమిరెడ్డి మధు, రాజ్ కుమార్, పైల గోవింద్, పెదిరెడ్ల చింతూ, మార్కెట్ రాజ, మురళి, క్యాంటీన్ రాజు, రుత్తల కృష్ణ, ఎస్హెచ్జీ సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు.

