Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిఅభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు

రాజ్యసభలో తనయుడు విజయ్ ప్రసంగంపై ఆనందం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న

మాకవరపాలెం మండలంలో పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్

నర్సీపట్నం, పెన్ పవర్ :

మాకవరపాలెం మండలం భీమవోయినపాలెం పంచాయితీ గండికోట గ్రామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్ కు గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
​ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తన కుమారుడు విజయ్ రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్ లో మాట్లాడటం చూసి, ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందని భావోద్వేగంతో ప్రసంగించారు. పార్లమెంట్ లో విజయ్ అద్భుతంగా మాట్లాడాడని, ప్రజాసేవలో క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే పార్టీ నాయకత్వం ఆయనకు ఈ ఉన్నత అవకాశం కల్పించిందని తెలిపారు. ఒక తండ్రిగా తాను కన్న కల నిజమైందని, యువ నాయకుడిగా విజయ్ రాజ్యసభ ఎంపీ కావడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీగా విజయ్ కి ప్రతి ఏటా వచ్చే రూ. 6 కోట్ల నిధులు (ఆరేళ్ల కాల పరిమితిలో రూ. 36 కోట్లు) మన ప్రాంత గ్రామాల్లో ప్రాథమిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు నేరుగా వినియోగించుకోవచ్చని వివరించారు.

​అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి లెక్కలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,07,573 మంది పెన్షన్ దారులకు నెలకు రూ. 2,712 కోట్లు పంపిణీ చేస్తుండగా, అనకాపల్లి జిల్లాలో 2,53,987 మందికి నెలకు రూ. 108 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో 41,236 మందికి నెలకు రూ. 17 కోట్ల 54 లక్షలు పంపిణీ చేస్తుండగా, కొత్తగా 28 మందికి స్పౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇక మాకవరపాలెం మండలంలో 9,894 మంది లబ్ధిదారులకు నెలకు రూ. 4 కోట్ల 24 లక్షలు అందిస్తున్నామని, ఇందులో కొత్తగా ముగ్గురకు స్పౌజ్ పెన్షన్ లు వచ్చాయన్నారు. పర్యటన జరిగిన గండిపేట గ్రామంలోని 34 మంది లబ్ధిదారులకు నెలకు రూ. 1,22,500 లబ్ధి చేకూరుతోందని తెలిపారు.

అభివృద్ధి సంక్షేమాల గురించి చెబుతూ, మాకవరపాలెం మండలానికి సుమారు రూ. 114 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు మంజూరయ్యాయని స్పీకర్ తెలిపారు. భీమబోయినపాలెం పంచాయితీ పరిధిలో గతంలో మంజూరైన 16 సి సి రోడ్లు, డ్రైనేజీ పనులు రూ. 88.70 లక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం గండికోట గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 40 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ​ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ ఆర్.వై. పాత్రుడు, జనసేన పార్టీ ఇంచార్జ్ సూర్యచంద్ర, నందకిషోర్, అల్లు నాయుడు, మండల పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular