మిస్సింగ్ కేసుల్లో అనకాపల్లి టౌన్ పోలీసుల చాకచక్యం.. ఇద్దరు మహిళలు సురక్షితం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
అనకాపల్లి, ఆగస్టు 1: అనకాపల్లి టౌన్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో రెండు వేర్వేరు మిస్సింగ్ కేసుల్లో అదృశ్యమైన ఇద్దరు వివాహిత మహిళలను సురక్షితంగా గుర్తించి రక్షించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది.
మొదటి కేసులో బీఆర్‌టీఎస్ కాలనీకి చెందిన వివాహిత జూన్ 23 నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆమె బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి మహిళను సురక్షితంగా అనకాపల్లికి తీసుకువచ్చారు. అయితే ఆమె కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు నిరాకరించడంతో చట్టపరమైన నిబంధనల మేరకు అనకాపల్లిలోని వన్ స్టాప్ సెంటర్‌కు అప్పగించారు.
రెండో కేసులో ముత్రాసి కాలనీకి చెందిన మరో వివాహిత జూలై 23 నుంచి కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి మహిళను సురక్షితంగా రప్పించింది. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ ఆమె కూడా కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు నిరాకరించడంతో చట్ట ప్రకారం వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు.
రెండు కేసులను చాకచక్యంగా ఛేదించి బాధిత మహిళలను సురక్షితంగా గుర్తించిన టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ప్రత్యేక పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. మహిళల రక్షణకు జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కేసుల్లో తక్షణ చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.

