- రాజకీయాలకు పనికిరాని అసమర్థలు మాటలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు.
- కూటమిప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారు.
- చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదు.
- యడ్లపాడు మండలంలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 08:
చిలకలూరిపేట : ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అనుకూల మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తోందని, ఐదేళ్లలో రాష్ట్రంపై అప్పులు, ప్రజలపై పన్నుల భారం మోపిన వారు, నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన యడ్లపాడు మండలం జాలాది, ఉప్పరపాలెం గ్రామాల్లో పర్యటించి, రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదు.
ప్రజల సంతృప్తి మేరకు మరింత సంక్షేమం, అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, నిధుల కొరతవల్లే కొంత ఆలస్యమవుతోందన్నారు. పంచాయతీ నిధుల్ని అధికారులు, స్థానిక నాయకులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎక్కడా మారుమూల గ్రామంలో కూడా చిన్న రోడ్డు వేయని వారు.. నేడు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రత్తిపాటి అసహనం వ్యక్తంచేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదని, ఆయన నాయకత్వంలో ప్రజలకు మేలు తప్ప, ఎన్నడూ కీడు జరిగింది లేదన్నారు. గతపాలకులు కేవలం దోపిడీకోసమే రాష్ట్రాన్ని పాలించారని, వారిని నమ్మి తాము ఎంత నష్టపోయామో ప్రజలు కూడా గుర్తించాలని ప్రత్తిపాటి హితవుపలికారు. కేవలం 20 నెలల్లోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు, అనుసంధాన రహదారులు పూర్తిచేశామని, చంద్రబాబు అభివృద్ధి పనుల అమల్లో ఎంత పట్టుదలతో ఉన్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
జగన్..వైసీపీనేతల దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు
మంచి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని, జగన్.. వైసీపీనేతలు చేసే విషప్రచారాన్ని పట్టించుకోకుంటే, వారి నోళ్లే మూతపడతాయని ప్రత్తిపాటి చెప్పారు. వారు చేసే దుష్ప్రచారానికి స్పందిస్తూ పోతే, ఐదేళ్లు అదే సరిపోతుందన్నారు. నమ్మకంతో కూటమిపార్టీలను గెలిపించిన ప్రజలకు మాత్రమే తాము జవాబుదారులుగా ఉంటామని, రాజకీయాలకు పనికిరాని అసమర్థుల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, కందిమల్ల రఘురామారావు, ముద్దన నాగేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, గ్రామ నాయకులు అల్లూరి ప్రసాద్, సర్పంచ్ బాబు, అంకమ్మరావు, సుమలత, వీర్ల అంకమ్మ, పెద్ద అంకమ్మ, రవి, కళ్యాణ్, ఎర్రాబ్బయి, వెంకట్రావు, పోలురాజు, యేబు, ఎంపీడీవో, డిఇ లు, అధికారులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

